Hot Posts

6/recent/ticker-posts

తిరుమల శ్రీవారి సేవకుల వ్యవస్థలో భారీ సంస్కరణలు?

ANDHRAPRADESH:ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 70,217 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,155 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఈశా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు.

శ్రీవారి సేవ స్వచ్చంద వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణలపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభించనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్ వైజర్ల సేవల కార్యాచరణ పురోగతి గురించి చర్చించారు.

ఐఐఎం-అహ్మదాబాద్ నిపుణులతో శ్రీవారి సేవకుల గ్రూప్ సూపర్ వైజర్లకు శిక్షణ ఇప్పించడానికి ఓ సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్బంగా శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని అన్నారు.

టీటీడీ ఐటీ డిపార్ట్మెంట్ ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. గ్రూప్ సూపర్ వైజర్ల కోసం రూపొందించిన అప్లికేషన్ ను తీరుతెన్నుల గురించి ఇందులో వివరించారు. అదే విధంగా ఎన్నారై సేవ, వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ సేవలను కూడా త్వరితగతిన ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఎన్నారై సేవలను మరింత విస్తరించడానికి ఏపీఎన్నార్టీతో టీటీడీ సంప్రదింపులు జరుపనుంది. 

త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్నారైలు కూడా తిరుమలకు వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారని టీటీడీ గుర్తించింది. వివిధ విభాగాల్లో వారి సేవలను వినియోగించాలని నిర్ణయించింది. 

ఇప్పటికే అమెరికా తదితర దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు విరివిగా నిర్వహించడానికి ఎన్నారైలు సహకరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల వల్ల వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించడానికి మరింత మంది ఎన్నారైలు ముందుకు వస్తారని భావిస్తోంది.