కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మంత్రి సవిత ఇక్కడ పర్యటించలేదు. అయితే దీనికి కొందరు టిడిపిలోని నాయకులే అడ్డుపడుతున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది.
KADAPA:కడప జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నబీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎక్కడా కనిపించడం లేదా? లేక ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదా? అంటే పట్టించుకోవడం లేదనే సమాధానం వినిపిస్తోంది. కడప జిల్లా బాధ్యతలు అప్పగించి దాదాపు 8 నెలలు దాటిపోయినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా మంత్రి సవిత జిల్లా రాజకీయాలపై దృష్టి సారించలేదు. టిడిపి నాయకులు సహా కూటమి నాయకులను కూర్చోబెట్టి ఆమె మాట్లాడింది కూడా లేదు. దీంతో నియోజకవర్గాల వారీగా నాయకులు విడిపోయి రాజకీయాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
దీనివల్ల `సుపరిపాలనలో తొలి అడుగు` కార్యక్రమం ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 10 నియోజకవర్గాల్లో రెండు చోట్ల మాత్రమే జరిగిందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వాస్తవానికి 10 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు లక్ష్యం విధించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో పది సీట్లు గెలవాలని కూడా భారీ లక్ష్యాన్ని పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ జిల్లా మంత్రి సవితకు చాలా సవాలుతో కూడిన జిల్లా అనే చెప్పాలి. బలమైన వైసీపీని ఎదుర్కొని, వచ్చే ఎన్నికల్లో పది స్థానాలను దక్కించుకునేలాగా ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మంత్రి సవిత ఇక్కడ పర్యటించలేదు. అయితే దీనికి కొందరు టిడిపిలోని నాయకులే అడ్డుపడుతున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. బలమైన నాయకులు, ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా పార్టీలో చక్రం చెపుతున్నారని.. వారి వల్లే మంత్రి సవిత ఈ జిల్లాపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారని కూడా కొందరు చెబుతున్నారు. కానీ ఇన్చార్జి మంత్రిగా ఆమెకు ఉండే హక్కులు, ఆమెకు ఉండే అధికారాన్ని వినియోగించి జిల్లాలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా ఇప్పటివరకు సవిత ప్రయత్నం అయితే చేయలేదు.
కేవలం తన నియోజకవర్గానికి(అనంతపురం), రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు మాత్రమే ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. చిత్రం ఏంటంటే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ విషయం తరచుగా వార్తల్లోనే వస్తుంది. కానీ ఇన్చార్జి మంత్రిగా చంద్రబాబు పెట్టిన బాధ్యతలను ఆమె సంపూర్ణంగా నెరవేర్చడం లేదన్న నివేదికలు వస్తుండడంతో ఆమెను ఈ జిల్లా నుంచి తప్పించే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
Social Plugin