AMRAVATHI,ANDHRAPRADESH:రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్మాణ పనులను ప్రారంభించిన సీఆర్డీఏ రెండో విడత భూ సమీకరణ పైన కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం రాజధాని విస్తరణ.. భారీ ప్రణాళికలతో రెండో విడత భూ సమీకరణ చేయాలని భావించింది. కాగా, సమీకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో వస్తున్న స్పందనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సీఆర్డీఏకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే సంక్రాంతి నాటికి అమరావతిలో తొలి గృహ ప్రవేశాల ముహూర్తం గా నిర్ణయించింది.
కీలక పరిణామాలు
అమరావతి రెండో విడత భూ సమీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, తాజాగా ప్రభుత్వం సీఆర్డీఏకు కీలక ఆదేశాలు ఇచ్చింది. భూ సమీకరణ విషయంలో హడావుడి వద్దని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండో విడత భూ సమీకరణ.. స్థానికంగా వస్తున్న స్పందన పైన చర్చ జరిగింది. దీంతో.. ఈ విషయం పైన పునరాలోచన చేయా లనే అభిప్రాయం వ్యక్తం అయింది. మొత్తంగా వెనక్కు వెళ్లకుండా.. ప్రస్తుతానికి కొంత వరకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచన పైన చర్చ జరిగిందని సమాచారం. మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉండటంపై రెండో దశలో భూము లు ఇవ్వాల్సిన రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తాజా నిర్ణయం
ఈ పరిస్థితుల్లో సమీకరణకు ముందుకు వెళ్తే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని ప్రభు త్వంలోని ముఖ్యులు భావిస్తున్నారు. కాగా..ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటనే అంశాలపై అవగాహన కల్పించకపోవడం, హడావిడిగా గ్రామసభల నిర్వహణతో ఆగ్రహం వస్తున్నట్లు గుర్తించారు. దీంతో, రెండో దశ భూ సమీకరణపై మంత్రుల కమిటీని నియమించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే రైతులను ఒప్పించి ముందుకు అడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ప్రక్రియను నిదానంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు నిర్దేశించింది. ఇదే సమయం లో ప్రభుత్వ లక్ష్యాలను సమర్ధవంతంగా రైతులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక, అసవరమైన భూమి విషయంలోనూ కసరత్తు జరుగుతోంది.
20 వేల ఎకరాలే
ప్రభుత్వం అమరావతి కేంద్రంగా రెండో విడత భూ సమీకరణ చేయటం ద్వారా భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌తో పాటు స్మార్ట్ ఇండ్రస్ర్టియల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి వాటిని నిర్మించాలనేది తాజా ఆలోచన. ఇందు కోసం రెండోదశలో అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద మద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలతో పాటు తుళ్లూరు మండలంలో వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో కలిపి 20,494 ఎకరాలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తున్నారు. వీటికి ల్యాండ్ పూలింగ్ నిబంధనలు అమలు చేస్తూ చట్టసవరణ చేశారు. కాగా, ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం భూ సమీకరణ ప్రక్రియను నిదానంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా సీఆర్డీఏకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
Social Plugin