ఈ అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగాళాఖాతం ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతుందని, మరింత బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వివరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో- హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, ఇతర అధికారులతో కలిసి ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఈ వాయుగుండం ఈ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటే అవకాశముందని తెలిపారు.
ఆ సమయంలో సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వంగలపూడి అనిత సూచించారు. ఈ వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలతో సమన్వయం చేసుకొని గండ్లు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Social Plugin