Hot Posts

6/recent/ticker-posts

విశాఖలో అయోధ్య రామాలయం.. వివాదం ఎందుకు?


విశాఖ బీచులో ఓ ధార్మిక సంస్థ వేసిన అయోధ్య రామాలయం సెట్టింగ్ తీవ్ర వివాదానికి దారితీస్తోంది.

ANDHRAPRADESH:విశాఖ బీచులో ఓ ధార్మిక సంస్థ వేసిన అయోధ్య రామాలయం సెట్టింగ్ తీవ్ర వివాదానికి దారితీస్తోంది. అయోధ్య రామాలయాన్ని దర్శించుకోలేని భక్తులకు ఆ స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని ఓ సంస్థ బీచ్ రోడ్డులో పార్క్ హోటల్ పక్కన ఖాళీ స్థలంలో అయోధ్య రామాలయం సెట్ వేసింది. అయోధ్యకు వెళ్లి రాముడిని ఎప్పుడు చూస్తామో అనుకున్న భక్తులు బీచ్ రోడ్డులో ఉన్న ఈ సెట్ లో దేవుడిని దర్శించుకుని తరిస్తున్నారు. రెండు నెలల పాటే ఈ సెట్ ఉంటుందని ప్రచారం చేయడంతో విశాఖ నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తున్నారు. దర్శనానికి రూ.50, చెప్పులు ఉంచడానికి మరో రూ.5 చొప్పున నిర్వాహకులు వసూలు చేస్తున్నా, భక్తులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.

అయోధ్య రామాలయ సెట్ చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నా, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరం చెప్పలేదు. ఇదే సమయంలో అన్నివర్గాల నుంచి తమకు ఆదరణ, సహకారం లభిస్తుండటంతో ఆ ధార్మిక సంస్థ అయోధ్య రామాలయ సెట్ ను ఫక్తు వ్యాపార కేంద్రంగా మార్చేసిందని విమర్శలు మొదలయ్యాయి. దర్శనానికి రుసుం వసూలు చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో భద్రాది రామాలయ పండితులతో స్వామి వారి కల్యాణోత్సవం జరిపిస్తామని, ఇందుకు రూ.2,999 టికెట్ రేటు నిర్ణయించడంతో వివాదం రేగింది. ఆ ధార్మిక సంస్థకు తమకు సంబంధం లేదని భద్రాచలం ఆలయ వర్గాలు ప్రకటించడంతో రెండు రోజులుగా విశాఖలో రచ్చ జరుగుతోంది.

నిజానికి ఈ నెలాఖరులోకా అయోధ్య రామాలయ సెట్ తొలగించాల్సివుంది. కానీ, భక్తుల ఆదరణ ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు మరికొన్నాళ్లు తమ వ్యాపారం కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా స్వామి వారి కల్యాణం చేస్తామన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారని అంటున్నారు. దీనికి భద్రాచలం ఆలయ వేదపండితుల పేర్లను వాడుకోవడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా భద్రాద్రి ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ ఆలయ ఈవో, కొందరు పూజారాలు ఈ విషయమై విశాఖ సీపీకి, దేవాదాయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం ఏంటో నిగ్గు తేల్చేపనిలో పడ్డారని అంటున్నారు.

అయితే మత సంబంధమైన సున్నిత అంశం కావడం, రామాలయం సెట్ వేసిన వ్యక్తుల వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారంటూ ప్రచారం జరగడంతో కేసు నమోదుకు పోలీసులు తటపటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రామాలయ సెట్ ప్రదర్శనపై ఎవరికీ అభ్యంతరాలు లేవని, కానీ ఈ అవకాశాన్ని వ్యాపారాత్మకంగా మలుచుకోవడం కరెక్టు కాదని పోలీసులు నిర్వాహకులకు సూచించినట్లు చెబుతున్నారు. అయితే భక్తుల కోరిక మేరకే తాము కల్యాణోత్సవానికి సిద్ధమయ్యామని నిర్వాహకులు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా విశాఖలో ఈ అంశమే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.