Hot Posts

6/recent/ticker-posts

తల్లికి వందనం డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటున్నారా ? ప్రభుత్వం క్లారిటీ..!


ANDHRAPRADESH:ఏపీలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీల్లో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా ఒక్కరికే తల్లి ఖాతాలో 15 వేల చొప్పున జమ చేసేవారు. దీంతో కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికీ 15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చాయి. తొలి ఏడాది ఇవ్వకపోయినా తాజాగా ఈ హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసిన తల్లికి వందనం పథకం డబ్బుల్ని తిరిగి వెనక్కి తీసేసుకుంటుందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన ఈ డబ్బులు తల్లుల ఖాతాల్లో ఇంకా విత్ డ్రా చేయకుండా ఉంటే వాటిని వెనక్కి తీసేసుకుంటారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ఎక్స్ లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

తల్లికి వందనం డబ్బులపై జరుగుతున్న ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించిన ప్రభుత్వం ఓ ఎక్స్ హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోను జత చేస్తూ క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం డబ్బుల్ని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది అని ఈ వ్యక్తి చెబుతున్న విషయం అబద్ధమంటూ ప్రభుత్వం తెలిపింది. మీ ఖాతాలో ఒకసారి జమ చేసిన సొమ్మును ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదని తెలిపింది. కాబట్టి లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన పడనక్కరలేదని తేల్చేసింది.