Hot Posts

6/recent/ticker-posts

సెంచరీ మీద టీడీపీ కన్నేసిందా ?

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కానీ మనసు అంతా 2029 మీదనే ఉంది. నిజానికి రాజకీయాలు చాలా మారిపోయాయి.

ANDHRAPRADESH:ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కానీ మనసు అంతా 2029 మీదనే ఉంది. నిజానికి రాజకీయాలు చాలా మారిపోయాయి. అవి ఇపుడే జరగలేదు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఒక ఎన్నికల్లో గెలిచిన వారు అయిదేళ్ళ పాటు ప్రజలను పాలించాల్సి ఉంటుంది. తాము చేసిన ప్రామిస్ మేరకు ఆచరించి చూపాల్సి ఉంటుంది. అయితే అయిదేళ్ళ తరువాత తామే రావాలంటే ఏమి చేయాలి అన్న ధ్యాసతో రాజకీయాలు చేయడమే విశేషం అంటున్నారు.

నాడు వైఎస్సార్ పిలుపు అదే

ఇక బాగా వెనక్కి వెళ్తే 2009లో రెండోసారి వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే ఆయన 2014 ఎన్నికల గురించి మాట్లాడారు. బొటాబొటిగా జనాలు పాస్ చేశారు అని తమకు వచ్చిన సీట్ల గురించి ఆయన చెబుతూ 2014 నాటికి పుంజుకోవడమే కాకుండా దేశంలో కాంగ్రెస్ ని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అన్నారు. అలా అప్పటికి మరో అయిదేళ్ళ ఎన్నికలను ముందుగా ఊహించి డైరేక్షన్స్ ఒక కాంగ్రెస్ సీఎం గా వైఎస్సార్ ఇచ్చారు. మరి విజనరీ అయిన చంద్రబాబు కూడా అదే విధంగా ఆలోచించకపోతేనే తప్పు కదా అంటున్నారు

విభజన ఏపీలో జోరు 

ఇక చూస్తే 2014లో ఉమ్మడి ఏపీ రెండుగా విభజన జరిగింది. ఏపీకి తొలి సీఎం గా చంద్రబాబు వచ్చారు. ఆనాటి నుంచి ఆయన 2019 ఎన్నికల గురించే ఆలోచించారు. తన పధకాలు కార్యక్రమాలు అన్నీ ఆ దిశగానే నడిపారు. అయితే 2019లో అనూహ్యంగా టీడీపీ ఓటమి పాలు అయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ అయితే 2024 గురించి ఆలోచించలేదు, అంతకంటే ఎక్కువగా మరో ముప్పయ్యేళ్ళ పాటు మేమే అని అతి నిబ్బరం ప్రదర్శించింది. దాంతో 2024 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలు అయింది.

డే వన్ నుంచే టార్గెట్ 

ఇపుడు చూస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డే వన్ నుంచే 2029 ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. మళ్ళీ మనమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి పార్టీలను ఆ దిశగానే నడిపిస్తున్నారు. అంతే కాదు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికపుడు మధింపు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక మొత్తం 164 సీట్లను కూటమి గెలిచింది. అందులో టీడీపీ వాటా 135గా ఉంది. ఇందులో మళ్ళీ వంద సీట్లలో మళ్ళీ గెలిచి తీరాలని టీడీపీ అధినాయకత్వం పట్టుదలగా ఉంది.

భారీ వ్యూహంతోనే ముందుకు 

వంద సీట్లలో కనీసం పోటీకి సైతం ప్రత్యర్ధులు జంకేలా వాటిని కంచుకోటలుగా తీర్చిదిద్దాలన్నది టీడీపీ అధినాయకత్వం పట్టుదలగా ఉంది. మంచి మెజారిటీలు వచ్చిన చోట పనితీరుని మరింత మెరుగుపరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ జనంలో ఎప్పటికపుడు మమేకం అవుతూ చేస్తే కనుక గెలుపు తధ్యమని టీడీపీ వ్యూహంగా ఉంది. అందుకే ప్రజలతోనే కలసి మెలసి ఉండమని కార్యక్రమాలను టీడీపీ డిజైన్ చేసి మరీ ఎమ్మెల్యేలను పంపిస్తోంది అంటున్నారు. వైసీపీకి వచ్చే ఎన్నికల నాటికి ఆయా చోట్ల పోటీకి అభ్యర్థుల సైతం జంకేలా సీన్ క్రియేట్ చేయాలన్నదే టీడీపీ పట్టుదలగా ఉంది. మరి టీడీపీ వ్యూహం ఫలిస్తే కనుక వైసీపీకి రాజకీయంగా గట్టి సవాల్ ఎదురు కావడం ఖాయమని అంటున్నారు.