Hot Posts

6/recent/ticker-posts

జగన్ పై సింగపూర్ కు తేల్చేసిన చంద్రబాబు..! తాజా ఆఫర్..!


 

ANDHRAPRADESH:ఏపీ రాజధాని అమరావతికి గతంలో మాస్టర్ ప్లాన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సింగపూర్ కు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం రావడంతో చుక్కలు కనిపించాయి. అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేసేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సింగపూర్ కన్సార్టియానికి షాకిచ్చాయి. దీంతో అమరావతి రాజధాని ప్లాన్ నుంచి సింగపూర్ వెనక్కి తగ్గింది. ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావడంతో తిరిగి అమరావతి రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు.

అమరావతిపై గతంలో ఎదురైన అనుభవాలతో మరోసారి ముందుకొచ్చేందుకు సింగపూర్ తటపటాయిస్తోంది. ఈ నేపథ్యంలో స్వయంగా సింగపూర్ వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడి అధికారులకు ధీమా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో జగన్ సర్కార్ అమరావతి విషయంలో చేసిన తప్పిదాలు, టీడీపీ ప్రభుత్వం అందించిన సహకారం, ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇస్తే పరిస్ధితి ఎలా ఉండబోతోందన్న దానిపై వారికి వివరణ ఇస్తున్నారు.

ఇవాళ రెండో రోజు సింగపూర్ లో పర్యటిస్తున్న చంద్రబాబు.. క్షేత్రస్ధాయిలో హౌసింగ్ ప్రాజెక్టుల్ని పరిశీలించారు. ఏపీలో హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు సింగపూర్ అంగీకరించిన నేపథ్యంలో.. అక్కడ సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేకతల్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు కాలి నడకన పర్యటించారు.

ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద ప్రస్తావించిన చంద్రబాబు.. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని, ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందని పేర్కొన్నారు.

గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ -ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత అంతరం వచ్చిందన్న అంశాన్ని సీఎం చంద్రబాబు వారికి గుర్తుచేస్తూనే అప్పటి తప్పులను సరిదిద్దడంతో పాటు.. ఉన్న గ్యాప్ ను తగ్గించేందుకు ప్రస్తుతం తాను సింగపూర్ వచ్చానని తెలిపారు. భవిష్యత్‌లోనూ సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా ఏపీలో, అమరావతిలో చేపట్టబోయే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను ఆయన కోరారు.