భారత స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం సాధారణంగా నష్టాలు కనిపించినప్పటికీ ఒక ఆసక్తికరమైన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది.
ANDHRAPRADESH:భారత స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం సాధారణంగా నష్టాలు కనిపించినప్పటికీ ఒక ఆసక్తికరమైన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఒకేరోజు రూ. 78.80 కోట్లు లాభపడ్డారని వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేరు శుక్రవారం ఏకంగా 7% వరకు పెరిగి రూ.493.25 కు చేరుకుంది. ఈ షేరు విలువ పెరుగుదలతో కంపెనీలో 24.37% వాటాను కలిగి ఉన్న భువనేశ్వరి కళ్ళు చెదిరే లాభాలను ఆర్జించారు. ఆమెకు ప్రస్తుతం 2,26,11,525 షేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణం హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేసిన మొదటి క్వార్టర్ ఫలితాలే. సానుకూలంగా ఉన్న ఈ ఫలితాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గణనీయంగా పెంచాయి. దీని ఫలితంగానే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు భారీగా పెరిగాయి.
ప్రస్తుతం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కుమారుడు నారా లోకేశ్‌కి కూడా ఈ సంస్థలో వాటా ఉంది. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రతిరోజూ 28.7 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. అంతేకాకుండా 418 రకాల డైరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. డైరీ రంగంతో పాటు పునరుత్పాదక ఇంధనం, ఆహార ఉత్పత్తుల రంగాల్లోనూ హెరిటేజ్ వ్యాపారాన్ని విస్తరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో కంపెనీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,136.8 కోట్లుగా నమోదు అయ్యింది. అయితే నికర లాభాల్లో మాత్రం 30.7 శాతం తగ్గుదల వచ్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.40.05 కోట్ల లాభాన్ని ఆర్జించగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.58.4 కోట్ల లాభాలు సాధించింది.
పాల సేకరణలో కంపెనీ వృద్ధిని నమోదు చేసింది. పాల సేకరణ 9.9 శాతం పెరిగి రోజుకు 17.8 లక్షల లీటర్లకు చేరుకుంది. పాల విక్రయాలు 2.8 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఇటీవల చోటుచేసుకున్న అసాధారణ వర్షాలు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని, దీంతో సరఫరా లో కూడా అంతరాయం కలిగి, లాభాల్లో తగ్గుదలకు కారణమైందని కంపెనీ పేర్కొంది.
చంద్రబాబు కంపెనీ అగ్రస్థానం
992లో చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ డైరీ , ఎఫ్‌ఎంసీజీ సంస్థగా ఎదిగింది. డైరీ, అగ్రి, రిటైల్ విభాగాల్లో కంపెనీ తన పట్టును నిరూపించుకుంది. డిసెంబర్ 2024 నాటికి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా గుర్తించబడ్డారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ రూ. 932 కోట్లుగా ప్రకటించారు. ఈ ఆస్తులలో భువనేశ్వరి పాత్ర ముఖ్యమైనది. ఆమె ప్రమోటర్‌గా కంపెనీలో అత్యధిక వాటాను కలిగి ఉన్నారు.
Social Plugin