Hot Posts

6/recent/ticker-posts

బాబూ.. ఇలాంటి మాటలు చాలా సార్లు చెప్పారు!


ANDRAPRADESH: ‘‘మీలో కొందరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవానులకుంటే మీ ఇష్టం. పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించేది లేదు. అవసరమైతే వారిని వదులుకోవడానికి కూడా సిద్ధం!.. మీ జాతకాలన్నీ నా దగ్గరున్నాయి. సర్వేలు చేయిస్తున్నా, మీ పని తీరు మీద నివేదికలు తెప్పిస్తున్నా.. గాడి తప్పిన నేతలను ఉపేక్షించేది లేదు’ ఈ స్థాయిలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయిలోని అగ్ర నేత ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఎవరికైనా ఏం అనిపిస్తుంది.


అధికారంలో ఉన్నాం గనుక.. ఏం చేసినా తమను అడ్డుకునే వారు ఉండరనే అహంకారంతో చెలరేగిపోయే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల తోకలు కత్తిరించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, అలాంటి అరాచక శక్తులమీద ఆగ్రహంతో ఉన్నారని అనిపిస్తుంది. కానీ చంద్రబాబునాయుడు వ్యవహార సరళిని తొలినుంచి లోతుగా గమనిస్తున్నవారికి మాత్రం.. అలా అనిపించదు. ఇలాంటి మాటలు ఆయన చాలానే చెబుతుంటార్లే.. చేతల్లో చూపించేదేమీ ఉండదు అని అనిపిస్తుంది.

4.0 ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే.. చంద్రబాబునాయుడు ఇప్పటికి అనేక సందర్భాల్లో ఇలాంటి మాటలు వల్లించారు. కానీ ఒక్క సందర్భంలో కూడా ఆయన పార్టీ నేతల మీద ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పార్టీ ఎమ్మెల్యేలను కనీసం మందలించినట్టు కూడా దాఖలాలు లేవు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి.. తెలుగుదేశం ఎమ్మెల్యేల ఆగడాలు, అరాచకాలు విపరీతంగా సాగుతున్నాయి.

చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక అనే విధానాన్ని తీసుకువచ్చారు. ఇసుక రవాణా విషయంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఎమ్మెల్యేలకు బహిరంగంగా హెచ్చరించారు. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా చూసినప్పుడు.. ఇసుక విక్రయాల్లో దందాలు చేయకుండా ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరని చెప్పొచ్చు. ఒక్కో ట్రాక్టరుకు ఇంత- అంటూ రేట్లు ఫిక్స్ చేసి వసూళ్ల పర్వం నడిపిస్తున్నారు. చంద్రబాబునాయుడు హెచ్చరికల్ని పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

లిక్కర్ టెండర్లు పిలిచినప్పటినుంచి ఎమ్మెల్యేల దందాలు మళ్లీ మొదలయ్యాయి. లిక్కర్ వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలని చంద్రబాబు నాయుడు పదేపదే అప్పట్లో కలెక్టర్లను హెచ్చరించారు. కానీ.. లిక్కర్ సిండికేట్లను నడిపించిందే లోకల్ ఎమ్మెల్యేలు. సిండికేట్ లనుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

లాభాల్లో వాటాలు తీసుకోకుండా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. టెండర్ల వ్యవహారం నడిచిన సమయంలో చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు చూసిన ఎవ్వరికైనా సరే.. తన పార్టీ ఎమ్మెల్యేలు దందాలు చేస్తే చంద్రబాబు వారి చర్మం ఒలిచేస్తారేమో అనే అనుకున్నారు. ఇసుమంత ఎఫెక్టు లేదు. చంద్రబాబు మాటలు మిగిలాయి తప్ప.. ఫలితం కనిపించలేదు.

తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో, చివరికి తొలిసారిగా గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో కూడా ఆయన మాటకు ఎలాంటి విలువ లేదని ప్రజలు అనుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అదే తరహాలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వైపు నుంచి ఇలాంటి మాటలు మిగులుతున్నాయే తప్ప.. ఆచరణలో ఏం కనిపించడం లేదు. తెదేపా ఎమ్మెల్యేల దందాలు, అవినీతి ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారైనా చంద్రబాబు తన ఆగ్రహానికి విలువ ఉన్నదని నిరూపించుకోవాలి.