ఇప్పటివరకు రాష్ట్రంలో 80 శాతం మందికి రేషన్ సరఫరా..
వృద్ధులు, దివ్యాంగులకు ప్రతినెలా 5వ తేదీ లోపు ఇంటివద్దనే రేషన్ అందజేత..
ఈనెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పదకంలో స్కూల్స్, కాలేజిల్లో విద్యార్ధులకు సన్నబియ్యంతో భోజనం..
రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్..
ఏలూరు: ఖచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు అందిస్తామని, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహార్ పేర్కొన్నారు.
సోమవారం ఏలూరులోని షాపు నెం. 74 చౌక ధరల దుకాణాన్ని, స్ధానిక ఈదర సుబ్బమ్మ నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒకవైపు రైతుబొమ్మతో పాఠశాలకు సరఫరాచేసిన 25 కేజీల కొత్త బియ్యం బస్తాలను, రాగిపిండి, బెల్లంపొడి ప్యాకెట్లను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్బంగా కొత్త రేషన్ విధానం అమలుపై స్ధానిక మహిళ డి. వెంకటలక్ష్మి తదితరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతపై స్ధానికులను అడిగి తెలుసుకున్నారు. చౌకదరల దుకాణాన్ని మంత్రితనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్ నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును ఆడిగి తెలుసుకున్నారు.
దుకాణంలో నిత్యావసరవస్తువుల నిల్వలను పరిశీలించారు. బోర్డుపై డీలర్ కు సంబంధించిన నెంబర్లను ఎస్ఓపి ప్రకారం ప్రదర్శించకపోడటంపై డీలర్ రాజులపాటి గంగాధరరావును ను మంత్రి నిలదీశారు. షాపును సున్నంవేసి మంచి వాతావరణంలో ఉంచవలసిన బాధ్యత ఉందని అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ఇంకా డోర్ డెలివరీ పూర్తిచేయకపోవడంపై మంత్రి డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత రేషన్ షాపులను క్షేత్రస్ధాయిలో పర్యటించి జవాబుదారీతనం పెంచాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. రేషన్ పంపిణీలో నిర్లక్ష్యానికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతినెలా 5వ తేదీ లోపే నూటికి నూరుశాతంపంపిణీ చేయాలని స్పష్టంగా ఆదేశించడం జరిగిందన్నారు. ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.
రేషన్ దుకాణాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, సరైన తూకంతో సరుకుల పంపిణీ చేయాలని, ధరలు, స్టాక్ వివరాల బోర్డులను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపు ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ షాపు నుంచి లబ్దిదారులు వారికి అనుకూలమైన సమయాల్లో సరుకులు తీసుకునేలా సౌకర్యం కల్పించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కోటి 42 లక్షల కుటుంబాలకు సరుకులు అందించే అద్బుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో 29,791 రేషన్ దుకాణాల పరిధిలో కోటి 46 లక్షల కార్డుదారుల కుటుంబాలకు రేషన్ సరుకులు అందిచాల్సివుండగా ఇప్పటికే దాదాపు కోటి 14 లక్షల కుటుంబాలకు రేషన్ అందించామన్నారు. అదే విధంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు సంబంధించి 15 లక్షల 75 వేల కుటుంబాలకు రేషన్ అందించాల్సి ఉండగా ఇంతవరకు 12 లక్షల 46 వేల కుటుంబాలకు ఇంటికే రేషన్ సరఫరా చేశామన్నారు.
కొన్ని డెత్ కేసులు, మైగ్రేషన్ మూలంగా అక్కడక్కడ రేషన్ పంపిణీ జరగలేదన్నారు. మొత్తంమీద 80 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. సర్వర్ సాంకేతిక లోపాలు, ఇతర కారణాలు మూలంగా రేషన్ నిలుపుదల చేయవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, వాట్సాప్ లో ఫోటో తీసుకొని సంతకం చేసుకుని సరుకులు ఇవ్వమని చెప్పడం జరిగిందన్నారు. ఆతర్వాత రీకన్సలైజేషన్ సమయానికి ఈఫోస్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగిందన్నారు.
అదే విధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పధకంలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజిల్లో చదివే విద్యార్ధులకు మరింత నాణ్యతగా భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా సన్నబియ్యంతో విద్యార్ధులకు భోజనం అందించే ప్రక్రియను ఈనెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 25 కేజీల పరిణామం కలిగి క్యూఆర్ కోడ్ తో బియ్యం ప్యాకెట్లను పాఠశాలలకు సరఫరా చేయడం జరిగిందన్నారు.రైతు పక్షపాతి అయిన కూటమి ప్రభుత్వం రైతుల్లో మరింత భరోసా కల్పించే విధంగా వారు పండించిన ధాన్యంకు సంబంధించి బియ్యాన్ని ఆయా పాఠశాలల్లో మద్యాహ్నం భోజన పధకానికి వినియోగించడం జరుగుతుందన్నారు. దీనినిమిత్తం ప్రతి బస్తాకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని, పలానా రైతు చేనులో పండించిన పంట ఈ పాఠశాలలోని విద్యార్ధినీ విద్యార్ధులకు తెలిసేలా సమాచారం పొందుపరిచా
మన్నారు. ఈనెల 12న ప్రారంభించి ఆ కార్యక్రమానికి ఆయా రైతులను సంబంధిత పాఠసాలలకు ఆహ్వానించి బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, విజయవాడ ఆర్.టి.సి. రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఎస్ఓ పి. శివరామమూర్తి, స్ధానిక కూటమి నాయకులు నారా శేషు, తదితరులు ఉన్నారు.
Social Plugin