Hot Posts

6/recent/ticker-posts

బెడిసి కొట్టిన రోజా ప్ర‌చారం.. టీటీడీ ఘాటు కామెంట్లు!


ANDRAPRADESH, THIRUPATHI: వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి రోజా.. త‌న‌ను తాను గొప్ప‌గా ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నంలో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ముఖ్యంగా రెండు ర‌కాల వ్యూహాల‌తో రోజా చేసుకున్న ప్ర‌చారానికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఘాటుగా బుద్ధి చెప్పారు. రోజా రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే. వైసీపీ ప్ర‌భుత్వం పోయినా.. ఆమె దూకుడు మాత్రం త‌గ్గ‌లేదు. రాజకీయాలు చేయొచ్చు. కానీ, వాటిని కూట‌మి ప్ర‌భుత్వానికి సెగ పెట్టేలా చేయాల‌ని అనుకోవ‌డంలోనే రోజా మైన‌స్ అవుతున్నారు. 


తాజాగా ఆమె తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. ఆమెకు ఆల‌య అధికారులు శ్రీవారి ప్ర‌సాదాల‌ను, శేష వ‌స్త్రాన్ని కూడా అందించారు. వేద పండితులు ఆశీర్వ‌చ‌నం చేశారు. ఇదీ.. జ‌రిగింది. అయితే.. దీనిపై రోజా ప్ర‌చారం వేరేగా ఉంది. తాను తిరుమ‌ల‌కు వెళ్తే.. నేరుగా.. ఆల‌య‌న డిప్యూటీ ఈవో వెంక‌య్య చౌద‌రి ఆహ్వానం ప‌లికి.. త‌న‌కు ప్ర‌సాదాలు అందించార‌ని.. త‌మ ప్ర‌భుత్వం మారినా.. తిరుమ‌ల‌కు తాము చేసిన సేవ‌ల‌కు... త‌మ‌ హ‌వా ఏమాత్రం త‌గ్గ‌లేద‌న్న‌ట్టుగా రోజా కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. 

త‌ద్వారా కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌డేలా చేయాల‌ని వ్యూహం ప‌న్నారు. కానీ, దీనిపై టీటీడీ అధి కారులు ఘాటుగా స్పందించారు. రోజాకు ఎలాంటి ప్రొటోకాల్ ద‌ర్శ‌నం ఇవ్వ‌లేద‌ని.. ఆమె నేరుగా సేవా టికెట్లు కొనుగోలు చేసి అంద‌రిలాగానే లైన్‌లో వ‌చ్చి స్వామిని ద‌ర్శించుకున్నార‌ని చెప్పారు. దీనికి సంబందించిన ఓ టికెట్‌ను కూడా వారు పోస్టు చేశారు. అంతేకాదు.. రోజా చెబుతున్న‌ట్టుగా.. వెంక‌య్య చౌద‌రి వెళ్లి.. ఆమెకు ప్ర‌సాదాలు అందించ‌లేద‌ని.. ఆ స్థానంలో ఆల‌య ప‌త్తేదార్‌(సెక్ర‌ట‌రీ) తీర్థ ప్ర‌సాదాలు అందించార‌ని ఫొటోల‌తో పాటు వివ‌రించారు. సో.. దీంతో రోజా చేసుకున్న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం బెడిసి కొట్టింది. అంతేకాదు.. ఎవ‌రు సేవా టికెట్లు కొనుగోలు చేసి వ‌చ్చినా.. వారికి ఇదే విధంగా ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ని.. తీర్థ ప్ర‌సాదాలు కూడా అందుతాయ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. దీనిలో రోజాకు ప్ర‌త్యేక‌త ఏమీ లేద‌ని చెప్పారు. దీంతో రోజాకు శృంగ భంగం అయింది.