TELANGANA: తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్నాళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచింది. అయితే.. దీనిపై ఎప్పటికప్పుడు ఊహాగానాలే తప్ప.. ఇప్పటి వరకు ఇతమిత్థంగా డేట్‌ను ఫిక్స్ చేయలేదు. కానీ.. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం పాటు.. ముహూర్తం కూడా నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం.. జూన్ చివరి వారంలో స్థానిక ఎన్నికల సమరం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ ఓటు బ్యాంకుపై కన్నేసింది. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథ కాల అమలును వేగవంతం చేస్తోంది. రైతులకు ఇస్తామన్న రుణ మాఫీ విషయంలోనూ క్లారిటీ ఇస్తోంది. ఇంకా అర్హులు ఉంటే నమోదు చేసుకోవాలని కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల కోణం బయటకు రావడం గమనార్హం.
ఇదిలావుంటే.. గత కొన్ని రోజులుగా గ్రామీణ వాతావరణంలోనూ రాజకీయ సందడి ప్రారంభమైంది. మంత్రులు, అధికారులు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు హామీలపై హామీలు ఇస్తున్నారు. ఇటీవల సీతక్క, భట్టి విక్రమార్క వంటివారు కూడా.. గ్రామాల్లో పర్యటించారు. ఇక, సీఎం రేవంత్‌రెడ్డి కూడా.. ఈ వారంలోనే గ్రామాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.
ఈ పరిణామాలను చూస్తే.. గ్రామీణ భారతంలో కీలకమైన ఎన్నికలకు పప్రభుత్వం సిద్ధమవుతోందన్న చర్చ జోరుగా సాగుతుండగా.. ఇప్పుడు ఏకంగా.. డేట్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఫిక్స్ చేసిందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై సానుకూల దృక్ఫథం ఉండడం.. బీఆర్ ఎస్ పూర్తిగా పుంజుకోకపోవడం.. పైగా అంతర్గత కలహాలతో పార్టీ సతమతమవుతున్న నేపథ్యంలో ఇదే సరైన సమయమని రేవంత్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
Social Plugin