ANDRAPRADESH: టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఏడాది మహానాడుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 27-29 మధ్య మూడు రోజుల పాటు మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించా లని పార్టీ నిర్ణయించింది. అంతేకాదు.. దీనిని ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. కడపలో తొలిసారి నిర్వహిస్తుండడం.. కూటమి ప్రభుత్వం జోరుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ దఫా మహానాడు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇప్పటికే మహానాడు నిర్వహణకు.. పార్టీ అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే.. మధ్యలో ఆపరేషన్ సిందూర్ కారణంగా వాయిదా వేయాలని అనుకోవడంతో మహానాడు పనులు కొంత మందగించాయి. తర్వాత.. భారత్-పాక్‌ల మధ్య పరిస్థితులు కొంత మేరకు సర్దుబాటు కావడంతో మహానా డును నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. అప్పటికి నాలుగైదు రోజులు పనులు ముందుకు సాగక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
తాజాగా గురువారం సాయంత్రం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు హుటాహుటిన కడపకు వెళ్లాలని.. తలా ఒక్కరు పనిని పంచుకో వాలని ఆయన సూచించారు. అంతేకాదు.. రేయింబవళ్లు పనులు చేస్తే తప్ప.. నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కావని కూడా తేల్చి చెప్పారు. అదేసమయంలో అధికార యంత్రాంగానికి కూడా పలు సూచనలు చేశారు.
ప్రజలు, నాయకుల భద్రత, ట్రాఫిక్ క్లియరెన్స్, వర్షం వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులులేకుండా సాగేలా ఏర్పాట్లు చేయాలని.. అవసరమైతే.. షిఫ్టుల వారీగా పనిచేయాలని.. పనులు ఎట్టి పరిస్థితిలోనూ ఆగడానికి వీల్లేదని.. 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పనులు పూర్తికావాలని కూడా డెడ్‌లైన్ పెట్టారు. దీంతో తమ్ముళ్లు హుటాహుటిన కడపకు చేరుకుని రేయింబవళ్లు అక్కడే ఉండి.. పనులు చేయించేందుకు కార్యాచరణ చేపట్టారు. మొత్తానికీ ఈ నాలుగు రోజులు మహానాడు పనులు జోరుగా సాగుతాయని అధికారులు కూడా చెబుతున్నారు.
Social Plugin