జంగారెడ్డిగూడెం: మండలంలోని గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో కార్తీకమాసోత్సవములలో సందర్భముగా ఈరోజు ఆలయ అర్చకులు ఉదయం గం4.00లకు నిత్య అర్చన, తోమాలసేవ, ఉత్సవమూర్తులకు విశేష అష్టోత్తర పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనమునకు అనుమతించారు. కార్తీకమాసం చివరి రోజు మరియు ఆదివారం కావడంతో కార్తీకమాసోత్సవములలో భాగంగా శ్రీస్వామివారి ఆస్థాన మండపంనందు ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి, అర్చక స్వాములు వైఖానస ఆగమ శాస్త్ర బద్దంగా శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణ క్రతువు నిర్వహించారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించారు. భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేయబడినది. ఆలయము వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,47,362/- లు సమకూరినది. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఉత్సవములు దిగ్విజయముగా నిర్వహించుటకు ఉత్సవ కమిటీ ఛైర్మన్ మరియు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారిణి వారి ఆదేశముల మేరకు ఉత్సవములలో సేవలందించిన పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, పంచాయితీ శాఖ, R.W.S. శాఖ, జంగారెడ్డిగూడెం ఆర్.టి.సి. డిపో వారు, విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారులకు మరియు ఈ నెలరోజులు కార్యక్రమములు ఎప్పటికప్పుడు భక్తులకు అందించిన ఎలక్ట్రానిక్, అండ్ ప్రింట్ మీడియా వారికి ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ. చందన ధన్యవాదములు తెలిపారు.
Social Plugin