Hot Posts

6/recent/ticker-posts

ఇల్లు లేని నిరుపేదలకు అదిరిపోయే శుభవార్త.. వారికి మళ్ళీ ఇళ్ళస్థలాలు


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఒకవైపు టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తూ లబ్ధిదారులకు అందిస్తూనే, మరోవైపు స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సహకారాన్ని అందిస్తోంది. ఇంకోవైపు ఇళ్ల స్థలాలు కూడా లేనివారికి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాలలో అయితే మూడు సెంట్లు స్థలం కేటాయించి ఇల్లు కూడా నిర్మాణం చేయించేందుకు సిద్ధమైంది.

ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఏపీ సర్కార్ తాజాగా మరోమారు ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. శాసనసభ సమావేశాలలో అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఔట్లలో చాలా ఇళ్లస్థలాలు ఖాళీగా ఉన్నాయని, సెంటు, సెంటున్నర స్థలంలో చాలామంది ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, ఇక అటువంటి వారితో మాట్లాడి త్వరలో వారికి కొత్త ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి శుభవార్త చెప్పారు.

గత ప్రభుత్వం ఇచ్చిన చోట ఇళ్ళు కట్టుకోవటానికి నిరుపేదలు అనాసక్తి

నిన్న శాసనసభలో మాట్లాడిన ఆయన పట్టణాలలో ఉన్న వారికి రెండు సెంట్లు స్థలాన్ని, గ్రామాల్లో ఉన్న వారికి మూడు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం పట్టణాలకు దూరంగా స్థలాలను కేటాయించిందని, దీంతో చాలామంది అక్కడికి వెళ్లి ఇళ్ళు కట్టుకోవడానికి ఆసక్తి చూపించలేదు అన్నారు.

ఆ విషయంలో కేంద్రాన్ని ఒప్పించిన సీఎం చంద్రబాబు

గత వైసిపి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మంజూరైన నాలుగు లక్షల ఇళ్లను రద్దు చేసిందని, లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు నిధులు మంజూరు చేయలేదని కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం గడువు ముగిసినప్పటికీ, 2026 మార్చినాటికి ఇళ్లను పూర్తి చేయడానికి కేంద్రాన్ని ఒప్పించి నిరుపేదలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని మంత్రి తెలిపారు.

ఆ స్థలాలను రద్దు చేసి మళ్ళీ స్థలాల కేటాయింపుకు విజ్ఞప్తి

గత ప్రభుత్వంలో పట్టణాలకు దూరంగా ఇచ్చిన స్థలాలను రద్దుచేసి, దగ్గర స్థలాలను కేటాయించాలని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్లకోసం అధిక ధరలకు భూములను కొన్నారని, దీనిపైన విచారణ జరిపి తప్పు చేసినవారిని జైలుకు పంపాలని కూడా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇతరుల ఆధార్ నెంబర్లతో ఇళ్లను మంజూరు చేయించుకున్న బోగస్ లబ్ధిదారులు కూడా ఉన్నారని కడప ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు.

నిరుపేదలకు ఇల్లు ఉండేలా ప్రభుత్వ చొరవ ఉందన్న మంత్రి

నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని వారందరికీ న్యాయం చేయాలని ఆమె శాసనసభ వేదికగా కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్యలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించి, వాటిపైన వివరణ ఇచ్చిన మంత్రి రాష్ట్రంలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా తమ ప్రభుత్వం చొరవ చూపుతోందని స్పష్టం చేశారు.