ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. గుర్తింపు కార్డు చూపిస్తే కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన కొన్ని సందేహాలు, సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాంటి నిబంధనలు ఉన్నాయి.?
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. కాస్త ఆలస్యంగానైనా ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ఇప్పటికే తెలంగాణలో అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు తెలంగాణలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో, ఏపీలో కూడా అలాంటి నిబంధనలే ఉన్నాయి. అయితే ఏపీలో కొన్ని ఘాట్ సెక్షన్స్‌లో నడిచే బస్సుల్లో ఈ పథకం అమల్లో లేదు. అలాగే కొన్ని రకాల బస్సుల్లో కూడా ఈ పథకం వర్తించదు. అవేంటంటే..
ఏయే బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది.?
స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న మహిళలు ఏపీ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రధానంగా పల్లెవెలుగులు, అల్ట్రా పల్లావెలుగులు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లలో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. కొన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలుసుకునేందుకు వీలుగా ఆర్టీసీ స్త్రీ శక్తి పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికిస్తోంది. దీంతో ఉచిత పథకం అందుబాటులో ఉన్న బస్సులను సులభంగా గుర్తించే ఏర్పాట్లు చేశారు.
ఏ బస్సుల్లో పథకం వర్తించదంటే.?
* నాన్‌స్టాప్ సర్వీసులు
* అంతరాష్ట్ర సర్వీసులు
* కాంట్రాక్ట్ బస్సులు
* ప్యాకేజీ టూర్స్
* సప్తగిరి ఎక్స్‌ప్రెస్
* అల్ట్రా డీలక్స్
* సూపర్ డీలక్స్
* ఏసీ బస్సులు
* స్టార్ లైనర్ వంటి బస్సుల్లో ఉచితం ప్రయాణం వర్తించదు. వీటిలో ప్రయాణిస్తే కచ్చితంగా టికెట్లు తీసుకోవాల్సిందే.
ఫోన్‌లో ఆధార్ చూపిస్తే సరిపోతుందా.?
డిజిలాకర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది డాక్యుమెంట్స్‌ను ఇందులోనే సేవ్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి వాటిని ఫోన్‌లోనే చూపిస్తున్నారు. దీంతో బస్సులో కూడా కండక్టర్‌కు ఫోన్‌లోనే ఆధార్ చూపిస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు అంగీకరించడం లేదు. తెలంగాణలో కూడా ఈ విధానం లేదు. కచ్చితంగా మహిళా ప్రయాణికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్ హార్డ్ కాపీని వెంట పెట్టుకొని వెళ్లాల్సిందే.
ఆధార్ జిరాక్స్ ఉంటే సరిపోతుందా.?
ఇక మరికొందరు ఆధార్ కార్డు జిరాక్స్ చూపించినా సరిపోతుందా.? అన్న ఆలోచనతో ఉంటారు. అయితే దీనిని కూడా అంగీకరించడం లేదు. కచ్చితంగా ఒరిజినల్ కార్డు ఉండాల్సిందే. లేకపోతే ఉచితంగా ప్రయాణించడం కుదరదు. ఇక కొంత మంది రాష్ట్ర విభజనకు ముందు ఉన్న ఆధార్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. కాబట్టి కచ్చితంగా ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలి. అందులోనూ ప్రస్తుత మీ ఫొటో ఉండేలా చూసుకోవాలి.
Social Plugin