Andhra Pradesh Jsw Posco Steel Plant Leave To Odisha: ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద ఉక్కు కర్మాగారం తరలిపోతోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ అనే సంస్థ ఒడిశాలో ఒక కంపెనీని కొనుగోలు చేసింది, అంతే! ఆంధ్రప్రదేశ్‌లో వారి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
రాజకీయ కారణాల వల్ల తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వం ఖండించింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు కూడా జరుగుతున్నాయి. నిజం ఎంత, అబద్ధం ఎంత?
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ తరలిపోతోందా?.. పొరుగున ఉన్న రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతోందా?.. గత రెండు, మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి ప్రముఖ ఉక్కు పరిశ్రమ తరలిపోతోందని.. పొరుగున ఉన్న ఒడిశాకు వెళుతోందని ప్రచారం చేస్తున్నారు.
' ఒడిశాకు తరలిపోయిన ప్రఖ్యాత ఉక్కు పరిశ్రమ . అమరావతి గ్రామాల్లో నీళ్లు తీసుకునే పనిలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం' అంటూ ట్వీట్ చేశారు
ఒడిశాకు తరలిపోయిన ప్రఖ్యాత ఉక్కు పరిశ్రమ. ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ హ్యారేస్మెంట్, టార్చర్, అవినీతి తట్టుకోలేక ఒడిశా కి వెళ్లిపోయిన జిందాల్ కంపెనీ.
అరె బాబు మీరు దావోస్ , సింగపూర్ కాదు రా ముందు మన దేశం లో ఉన్న కంపెనీస్ తో మాట్లాడి ఆంధ్ర తీసుకురండి. అమరావతి గ్రామాల్లో నీళ్లు తీసుకునే పనిలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం' అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ‘జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు.
జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఒడిసా లోని ఒక కంపెనీని కొనుగోలు చేసింది. అక్కడ దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ తరలిపోవడం లేదు.
గత నెల 18న జరిగిన బోర్డు మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో కలిసి సమగ్ర ఇనుప ఖనిజం ప్రాజెక్టును రూ.1,075 కోట్లతో ప్రారంభించేందుకు జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఆమోదించింది. ఇందులో ఎపిఎండిసికి 11 శాతం వాటా, జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ కు 89 శాతం వాటా ఉంటుంది.
ఈ రెండు వేరు వేరు ప్రాజెక్టులు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ తరలిపోతున్నట్లు ఫేక్ వార్తను రాజకీయ కారణాలతో సర్క్యులేట్ చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది.
అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా, అమరావతి నీట మునిగినట్లు ఆ నీళ్లు తోడే పనిలో రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉండగా జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఒడిసాకు తరలిపోయినట్లు కట్టుకథలు సర్క్యులేట్ చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి’ అంటూ హెచ్చరించారు.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సున్నపురాళ్లపల్లెలో JSW స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో మొదటి దశ పనులు చేపట్టారు.. మొత్తం రూ.11,850 కోట్లతో రెండో దశ పనులు పూర్తి చేస్తారు. 2026 జనవరి నాటికి మొదటి దశ పనులు మొదలు పెట్టి, ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2029 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు.
2031 జనవరి నాటికి రెండో దశ పనులు మొదలు పెట్టి, 2034 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరా భూమిని రూ.5 లక్షల చొప్పున JSW సంస్థకు ఇచ్చింది. గతంలోనే ఈ ప్లాంట్ కు భూమి పూజ చేశారు.
కానీ కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మళ్ళీ పరిశ్రమ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.
Social Plugin