అందువల్ల ఏం బ్రదర్ అంటే ఏమి సోదరా అని బంధాలు కలుపుకుంటూ ముందుకు సాగిపోతే ఆ రాజకీయ పంధాయే వేరే లెవెల్ అని చెప్పాలి.
HYDERABAD:అన్న దమ్ముల అనుబంధం తెలుగు నాట రాజకీయాలల్లో వెల్లి విరుస్తోంది. ఎంత రాజకీయం అయినా రాగబంధాలు ఉంటాయి కదా. సెంటిమెంట్ అన్నది కూడా రాజకీయాల్లో ఉండాల్సిన ప్రధాన ఇంధనమే కదా. అందువల్ల ఏం బ్రదర్ అంటే ఏమి సోదరా అని బంధాలు కలుపుకుంటూ ముందుకు సాగిపోతే ఆ రాజకీయ పంధాయే వేరే లెవెల్ అని చెప్పాలి.
ఇక తెలుగు నాట చూస్తే కల్వకుంట్ల వారి కుటుంబంతో వైఎస్ జగన్ కి ఎంతో బంధం ఉంది అని అంటారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తెలంగాణా సీఎం హోదాలో వచ్చి మరీ ఆశీస్సులు అందజేశారు. అది మొదలు ఆ బంధం తెర ముందు మరింతగా వర్ధిల్లుతోంది. ఇక కేటీఅర్ యువ నాయకుడు. దాంతో జగన్ కేటీఆర్ ఈ ఇద్దరి మధ్యన మంచి సాన్నిహిత్యమే ఉంది.
నా సోదరుడు అని జగన్ ని కేటీఆర్ సంభోదిస్తూ ఉంటారు. ఆయన జగన్ గురించి తన అభిమానం మీడియా ముఖంగా కూడా దాచుకోరు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఏపీలో వైసీపీ ఓడిపోతుందని అసలు ఊహించలేదని కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వైసీపీ గెలిచి తీరుతుందని కేసీఆర్ ఫ్యామిలీ అయితే చాలా ధీమాగానే ఉందని చెబుతారు. కానీ వారికి కూడా ఆ ఫలితాలు షాకింగ్ గానే ఉన్నాయని అంటారు.
ఇక కేటీఆర్ పుట్టిన రోజు తాజాగా వస్తే జగన్ ఆయన కోసం ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. అందులో విశేషం ఏమిటి అంటే నా సోదరుడు అని సంబోధించడం. కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించడం. అంటే ఒక అన్నగా తన తమ్ముడికి బెస్ట్ విషెస్ ని జగన్ ఇచ్చారు అన్న మాట. కేటీఆర్ కలలు అంటే తెలిసిందే. ఆయన సీఎం కావాలి. అలా అవుతారు అని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. జగన్ మదిలో కూడా అదే ఉండి ఉండాలి. అందుకే అలా దీవించారు అని అంటున్నారు. ఇలా ఈ అన్నదమ్ముల అనుబంధం ఒక్క ట్వీట్ లో బయటపడింది.
కట్ చేస్తే తెలుగు నాట మరో అనుబంధం కనిపిస్తోంది. అదే కూటమిలో ఉన్న రెండు పార్టీల కీలక నేతల మధ్య. చంద్రబాబు కుమారుడు అయిన నారా లోకేష్ జనసేన అధినేత పవన్ ని అన్నా అని పిలుస్తారు. ఇది చాలా కాలంగా జరుగుతున్న విషయమే. పవన్ అన్న అని ఆయనను సంభోదిస్తారు. తన అన్న సినిమా రిలీజ్ వేళ లోకేష్ కూడా ఒక ట్వీట్ వేశారు. అన్న సినిమా కోసం తాను అందరిలాగానే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను అని కూడా అందులో చెప్పారు.
ఇక మంత్రివర్గ సమవేశానికి వచ్చిన పవన్ ని లోకేష్ హగ్ చేసుకుని మరీ తన తమ్ముడి వాత్సల్యం చూపించారు. పవన్ సైతం లోకేష్ ని తమ్ముడిగానే భావిస్తారు. ఇలా ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఒక మంచి అన్న దమ్ముల బంధం అని చెప్పాల్సిందే.
అయితే మరో విశేషం ఇక్కడ ఉంది. జగన్ ని తన అన్నగా లోకేష్ ని తన తమ్ముడుగా భావించే కేటీఆర్ పుట్టిన రోజు వేళ లోకేష్ ఆయనను గ్రీట్ చేస్తూ ఎందుకు ట్వీట్ వేయలేదూ అన్న చర్చ అయితే ఉంది. పైగా లోకేష్ ని తాను కలిస్తే తప్పా అని ఈ మధ్యనే కేటీఆర్ కూడా మీడియా ముందు రెట్టించి మాట్లాడారు. ఆయన తనకు సోదరుడు అని కూడా చెప్పారు. కానీ లోకేష్ నుంచి ఆ విధంగా గ్రీట్ రాలేదు ఎందుకు అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అన్నదమ్ముల బంధానికి ఎపుడూ ఒక విలువ ఉంటుంది. ఆసక్తి కూడా ఉంటుంది. తెలుగు నాట కూడా ఈ బంధాలు అలాగే బలంగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు.
Social Plugin