Hot Posts

6/recent/ticker-posts

బొబ్బిలి కోట వెలిగిపోతుందా ?


ఆయన వారసులుగా ఉన్న అశోక్ ప్రజా స్వామ్యంలోనే రాజుగా బతికారు. జనాలు అలాగే ఆదరించారు ఆయన మాటే శాసనం అన్నట్లుగానే అంతా సాగిపోయింది.

VIJAYANAGARAM:విజయనగరం జిల్లాలో చరిత్ర చాలా ఉంది. రెండు రాజ్యాలు రెండు సమ్ష్తానాలు, ఎంతో మంది రాజులు అనేక సంఘటనలు చరిత్ర పుటలలో పదిలంగా ఉన్నాయి. వందల ఏళ్ళు వెనక్కి వెళ్తే విజయనగరం కోట ఒక పెద్ద సంస్థానాధీశుడి. అదే పూసపాటి వారిది. రాజుగా పట్టాభిషిక్తుడు అయిన చివరి నాయకుడు పీవీజీ రాజు. అంటే అశోక్ గజపతిరాజు తండ్రి అన్న మాట.

ఆయన వారసులుగా ఉన్న అశోక్ ప్రజా స్వామ్యంలోనే రాజుగా బతికారు. జనాలు అలాగే ఆదరించారు ఆయన మాటే శాసనం అన్నట్లుగానే అంతా సాగిపోయింది. తెలుగుదేశం పార్టీని ఆయన జిల్లాలో అంతా తానై నడిపించారు. ఆయన చేతుల మీదుగా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కీలక పదవులు అందుకున్నారు. ఇపుడు రాజ్ భవన్ కి అశోక్ వెళ్ళబోతున్నారు.

దాంతో విజయనగరం కోట రాజకీయం ఏమవుతుంది అన్న బెంగ అయితే ప్రతీ ఒక్కరిలో ఉంది. దశాబ్దాల పాటు కోట చుట్టూనే రాజకీయాలు నడచాయి. విజయనగరంలో ఏమి జరిగినా కోట కేంద్రంగా మారింది. అలాంటి ఈ కోట వెలవెలబోతుందా అన్నదే చర్చగా ఉంది. 

మరి అదే జరిగితే ఏమవుతుంది అన్నది కూడా ప్రశ్నగా ఉంది. అయితే బొబ్బిలిలో మరో సంస్థానం ఉండేది. అక్కడ కూడా బలమైన కోట ఉంది. స్వాతంత్య్రానికి ముందు బొబ్బిలి రాజులు ఒక వెలుగు వెలిగారు మద్రాస్ ప్రెసిడెన్సీలో వారు కీలక పదవులు చేపట్టారు. మళ్ళీ కొన్ని తరాల తరువాత సుజయ క్రిష్ణ రంగారావు, బేబీ నాయన తమ పూర్వీకుల వారసత్వం నిలబెట్టేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బొబ్బిలి రాజులు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం పెనవేసుకుని ఉన్నారు.

అలా వైసీపీలోకి వచ్చినా తరువాత కాలంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో ఆ పార్టీలోనే వారు మెల్లగా తమ హవా చూపిస్తున్నారు. 2019లో ఓడినా 2024లో బొబ్బిలి రాజుల వశం అయింది. బేబీ నాయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఇపుడు చూస్తే అశోక్ గజపతిరాజు గవర్నర్ గా వెళ్తున్నారు. దాంతో విజయనగరం కోట నుంచి రాజకీయం కాస్తా బొబ్బిలి కోటకు షిఫ్ట్ అవుతుందా అన్న చర్చ సాగుతోంది.

విజయనగరంలో వెలమలు కూడా రాజకీయంగా అతి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వెలమ దొరలుగా పేరు గడించిన బొబ్బిలి రాజులు జిల్లాను టీడీపీ రాజకీయాలను ఒడిసిపట్టగలరా అన్నది ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు. అంగబలం అర్ధబలం ఉంది.

అధినాయకత్వం కనుక అండగా నిలిస్తే టీడీపీ వైభవం బొబ్బిలి కోట నుంచే వెలిగించాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అశోక్ గజపతి రాజు తరువాత అంత ధీటు అయిన నాయకత్వం కోటలో లేకపోవడం ఒక లోటు అయితే ఎంతమంది వచ్చినా అశోక్ స్థానాన్ని భర్తీ చేయలేరు అన్నది మరో మాటగా తమ్ముళ్ళ నుంచి వినిపిస్తోంది. అయితే బొబ్బిలి కోటకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఎమై జరుగుతుందో.