Hot Posts

6/recent/ticker-posts

తిరుమలలో శ్రీవారి భక్తులు పడిగాపులు పడకుండా..: రూ. 60 లక్షలు


ANDHRAPRADESH:ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 77,481 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 30,612 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.96 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంగ్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

శ్రీవాణి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేయడానికి వీలుగా తిరుమలలో కొత్తగా దర్శనం టికెట్ల కేంద్రం ఏర్పాటైంది. శ్రీవాణి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను జారీ చేయాలని టీటీడీ పాలక మండలి గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ కేంద్రం ఏర్పాటైంది. దీని నిర్మాణం కోసం టీటీడీ 60 లక్షల రూపాయలను వ్యయం చేసింది.

తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ మొదలవుతుంది.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు తెల్లవారు జామున 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారని, ఈ నేపథ్యంలో వారికి మరింత సులభతరంగా టికెట్లు జారీ చేయడానికి వీలుగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దీన్ని నిర్మించినట్లు తెలిపారు. 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు.

అనంతరం తిరుమల హిల్ వ్యూ కాటేజీ, అంజనాద్రి నగర్ కాటేజీ ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూతనంగా ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాలను టీటీడీ ఛైర్మన్ ప్రారంభించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, జంగా కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, నరేష్, సదాశివరావు, నర్సిరెడ్డి, జానకి దేవి, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.