Hot Posts

6/recent/ticker-posts

భారత విమానయాన రంగంలో సంక్షోభం!



భారతదేశ విమానయాన రంగం గత దశాబ్ద కాలంగా అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది.

INDIAN NEW: భారతదేశ విమానయాన రంగం గత దశాబ్ద కాలంగా అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. కొత్త విమానయాన సంస్థలు రంగప్రవేశం చేయడం, విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడం వంటివి ఈ రంగ విస్తరణకు దోహదపడుతున్నాయి. అయితే, ఈ వేగవంతమైన విస్తరణకు భద్రతా వ్యవస్థ బలోపేతం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విమానయాన భద్రతను పర్యవేక్షించే కీలక సంస్థలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇది రాబోయే కాలంలో ఒక పెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత విమానయాన భద్రతకు బాధ్యత వహించే ప్రధాన సంస్థలైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య షాకింగ్‌గా ఉంది. లోక్‌సభలో ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం

DGCAలో 1,692 ఆమోదించిన పోస్టులలో ఏకంగా 814 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. BCASలో 598 పోస్టులకు గాను 224 ఖాళీలు ఉన్నాయి. ఇక, AAIలో 25,730 పోస్టులకు 9,502 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయాయి. ఈ సంఖ్యలు కేవలం కాగితాలపై గణాంకాలు మాత్రమే కావు.. ఇవి నేరుగా విమాన భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు, సాంకేతిక నిపుణులు లేకపోవడం వల్ల విమానాల భద్రతా పరిశీలనలు, పైలట్ లైసెన్స్ మంజూరు ప్రక్రియ, శిక్షణా సిమ్యులేటర్ల తనిఖీలు, విమానయాన సంస్థల నిర్వహణ తనిఖీలు వంటి కీలక కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయి లేదా పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.

విమానయాన రంగంలో చిన్న పొరపాటు కూడా పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవైపు కొత్త విమానయాన సంస్థలు పుట్టుకొస్తున్నాయి, విమానాల రాకపోకలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా భద్రతా వ్యవస్థ మరింత పటిష్టంగా మారాలి. కానీ, ప్రస్తుతమున్న వ్యవస్థ మానవ వనరుల కొరతతో పరిమితుల మధ్యనే పనిచేస్తోంది. శాశ్వత నియామకాలు ఆలస్యం కావడం, ఎక్కువగా ఒప్పంద ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవడం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.