ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, గోవాలో పూర్తిగా విస్తరించాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాయి.. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎంట్రీ ఇస్తాయని అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది అని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రోజే కేరళలో పూర్తిగా, తమిళనాడులో 90%, కర్ణాటకలో కొంత భాగం విస్తరించడం సాధారణం కాదని వాతావరణ నిపుణులు అంటున్నారు. గతంలో 1971లో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రోజే కర్ణాటకలో ఎక్కువ భాగం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపారు. "రుతుపవనాలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో జూన్ 2 వరకు మహారాష్ట్ర, తూర్పు తీరంలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, జూన్ 2 తర్వాత నెమ్మదిస్తాయంటున్నారు.
అలాగే మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గర శనివారం తీరం దాటిన వాయుగుండం బలహీనపడింది.. తీవ్ర అల్పపీడనంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఉంది. ఇది తూర్పు దిశగా కదులుతూ సోమవారం నాటికి మరింత బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని వల్ల మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతంలోకి వెళ్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడుతుంది. ఇది మరింత బలపడి గురువారం నాటికి బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో (ఈనెల 29 వరకు) ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములతో కూడిన గాలులు గంటకు 70 కి.మీ వేగంతో వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యానవన రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Social Plugin