ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్ల మరమ్మత్తులు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. పాడైన 274 రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. దీంతో పాటు భారీ ఎత్తున నిధుల్ని కూడా మంజూరు చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాకాలం సందర్భంగా పలు చోట్ల రోడ్లు పాడయ్యాయి. దీంతో జనం నీరు నిలిచిపోయి గుంతలు పడిన రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనిపై ప్రజా ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన సీఎం చంద్రబాబు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాడైన 274 రోడ్లను గుర్తించిన ప్రభుత్వం.. వాటికి తక్షణం మరమ్మత్తులు చేసేందుకు వీలుగా రూ.1000 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తుల కోసం గుర్తించిన రహదారుల్లో నేషనల్ హైవేలతో పాటు మేజర్ జిల్లా రోడ్లు కూడా ఉన్నాయి. ఇందులో 108 రాష్ట్ర స్థాయి రహదారుల కోసం రూ.400 కోట్లు, మరో 166 జిల్లా రహదారుల కోసం రూ.600 కోట్లు కేటాయించారు.
ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోడ్లపై గుంతలు లేకుండా మరమ్మత్తులు చేపట్టాలని ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల మరమ్మత్తులు జరగకపోవడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీనిపై అప్పట్లో విపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన పలు ఉద్యమాలు చేశాయి. సోషల్ మీడియాలోనూ అప్పటి జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు.
చివరికి గత ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ పలు రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు వరుసగా రోడ్లను మరమ్మత్తులు చేస్తోంది.

Social Plugin