గత సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు 46 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసాం
ఎన్నికల ఇచ్చిన హామీలే కాక చెప్పని పధకాలను కూడా అమలు చేస్తున్నాం
జిల్లాలో 10 వేల 655 మంది లబ్దిదారులకు రూ. 16 కోట్లు పంపిణీ
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో శనివారం 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమంలో పాల్గొని ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ దారులకు 15 వేల రూపాయల చొప్పున చెక్కును స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ లతో కలిసి మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సంక్షేమ పధకాల అమలులో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని, గత సంవత్సరం 46 వేల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశామన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఏలూరు జిల్లాలోని 10 వేల 655 మంది లబ్దిదారులకు రూ. 16 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంకా అర్హులెవరైనా మిగిలి ఉంటె, దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందిస్తామన్నారు.
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను రాజకీయ లబ్ది కోసం కాకుండా బాధ్యతగా నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పధకం సూపర్ హిట్ అయిందన్నారు. అవ్వా ,తాతలకు పెన్షన్ ను 4 వేల రూపాయలకు పెంచామన్నారు, ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలు పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు.
గత దీపావళికి ఉచిత గ్యాస్ పధకాన్ని అమలు చేసే సమయానికి గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రైతులకు, 1674 కోట్ల రూపాయలు, మిల్లర్లకు వెయ్యి కోట్ల బకాయిలు పెట్టిన బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి ఉచిత గ్యాస్ పంపిణీకి ముందుకు వెళ్లండని చెప్పారని, 2500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉచిత గ్యాస్ పధకాన్ని అమలు చేశామన్నారు. రాష్ట్రంలో 2. 81 కోట్ల గ్యాస్ సిలెండర్లను కోటీ 4 లక్షల కుటుంబాలకు అందించామన్నారు. స్త్రీ శక్తీ పధకం కింద 96 శాతం మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారన్నారు.
మహిళల విద్య, ఉపాధికోసం దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. తల్లికివందనం పధకాన్ని కుటుంబంలో ఒక్కరికి అమలు చేసేందుకే గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నప్పటికీ అందరికీ తల్లికి వందనం కార్యక్రమం అమలుచేశామన్నారు.
తమ ప్రభుత్వం ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే ప్రభుత్వమని, ఆటో డ్రైవర్లు గ్రీన్ టాక్స్ సమస్యపై తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండవ కేబినెట్ మీటింగ్ లో పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు.
రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి లో ఎక్కడా వెనుకడుగువేయబోమని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ఆటోలపై విధించిన అపరాధ రుసుము తగ్గించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తానన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయంతో వాహనానికి భీమా, ఫిట్నెస్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లాను రాష్ట్రంలోని అభివృద్ధిలో మొదటి 5 స్థానాలలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. జీఎస్టీ 2. O లో 800 కు పైగా వస్తువులపై పన్నులను తగ్గించామన్నారు. కొత్త ఆటో కొనుగోలులో 24 వేల రూపాయల వరకు ఆదా చేయవచ్చన్నారు. విద్యా, వైద్యం, భీమా లపై జీఎస్టీ ని ఎత్తివేశామన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 'ఆటో డ్రైవర్ల సేవలో' పధకంలో 10 వేల 655 మంది అర్హులుగా గుర్తించామని, వీరికి 15 రూపాయలు చొప్పున 15. 98 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. ఇంకా అర్హులెవరైనా మిగిలి ఉంటె, దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందిస్తామన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ రాష్ట్రంలో సూపర్ 6.. సూపర్ హిట్ అయిందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పధకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. ఉచిత బస్సు పధకం కారణంగా తమ జీవనభృతి పోతుందన్న ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి 'ఆటో డ్రైవర్ల సేవలో' పధకాన్ని హామీ ఇవ్వకున్నా కూడా అమలు చేశారన్నారు. ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు.
ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో వంటి గొప్ప పధకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఏలూరు పట్టణంలో 1880 మంది ఆటో డ్రైవర్లకు 2.82 కోట్ల రూపాయలు అందించారన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పాల్గొన్న 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమాన్ని సభావేదిక వద్ద ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు, ఆర్డీఓ యం.అచ్యుత అంబరీష్, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, ఉప రవాణా కమీషనర్ కరీం , ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ పంకజ్ కుమార్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్.ఎం. ఆర్ పెదబాబు, వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు తహసీల్దార్ గాయత్రి, ఆటో యూనియన్ నాయకులు లీలాకృష్ణ, సూరిబాబు, ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు, ప్రభృతులు పాల్గొన్నారు.
అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంఎల్ఏ బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) , మేయర్ షేక్ నూర్జహాన్, వివిధ ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ దుస్తులతో ఆటోలో సభాస్థలికి వచ్చారు.
Social Plugin