Hot Posts

6/recent/ticker-posts

అక్రమ మద్యం ఘటనలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం

గ్రామాల నుంచి ఎంపీకి ఫిర్యాదులు

జిల్లా ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ

ఆక్రమార్కులపై కఠిన చర్యలకు ఆదేశం 

‎జిల్లాలో ఇటీవల మళ్లీ అక్రమ మద్యం కేసులు వెలుగు చూడటంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కల్తీ మద్యం బయటపడిన సంగతి తెలిసిందే. 

తాజాగా  కొన్ని గ్రామాలలో అక్రమ మద్యం అమ్ముతున్న విషయం తన దృష్టికి రాగా, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు కనిపించినా, కల్తీ మద్యం అమ్ముతున్నట్లు తెలిసినా సహించేది లేదన్నారు. 

జిల్లాను అక్రమ మధ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని ఎంపీ కోరారు. ఎక్కడైనా బెల్టు షాపు గుర్తిస్తే వారికి మద్యం సరఫరా చేసిన మద్యం షాపు వారి లైసెన్స్ కూడా రద్దు చేయాలని ఎంపీ ఆదేశించారు. దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలను ఉల్లంఘించి అధిక ధరలకు మద్యం అమ్మేవారిపై కూడా దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. 

తక్కువ నాణ్యత ఉండే మద్యం తీసుకువచ్చి, అధిక ధర ఉండే బ్రాండ్ల సీసాలలో నింపి కొన్ని చోట్ల సరఫరా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అటువంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. 

ఆక్రమ మద్యం వెనుక ఎంత పెద్ద స్థాయి వ్యక్తులున్నా ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడా మద్యం అక్రమాలు జరగడానికి వీల్లేదని, మరోసారి ఇలాంటి ఘటనలు తన దృష్టికి వస్తే, మంత్రి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళతానని, ఉదాసీనంగా వ్యవహరించే ఉన్నతాధికారులపై కూడా చర్యలు ఉంటాయని  హెచ్చరించారు. 

దీనిపై స్పందించిన జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్.. అన్ని చోట్లా తనిఖీలు చేపడుతున్నామని, అక్రమాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.