మొక్కలను పెంచడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి.. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండటానికి చెట్లు చాలా ముఖ్యం. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం.. పచ్చదనాన్ని పెంచడానికి ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా.. వాటిని సంరక్షించిన వారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ ఆలోచనతోనే కార్బన్ క్రెడిట్ ( తెలంగాణ సౌభాగ్యం ) పథకాన్ని ప్రవేశపెట్టింది
కార్బన్ క్రెడిట్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం..
ఈ కొత్త పథకం ప్రకారం.. గత మూడేళ్లలో (2022, 2023, 2024) నాటిన మొక్కలు ఇప్పటికీ బతికి ఉంటే.. వాటిని సంరక్షించిన వారికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వనుంది. అటు రైతులకు అయినా.. మొక్కలను సంరక్షించిన ఎవరికైనా ఈ ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఐఓఆర్‌ఏ (IORA) అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ మొబైల్ అప్లికేషన్ ద్వారా మొక్కల వివరాలను నమోదు చేస్తుంది.
మొక్కల రకం, వాటి పెరుగుదల, కాండం పరిమాణం వంటి వాటిని బట్టి.. మొక్కల సంఖ్యను బట్టి.. ఆ ప్లాంట్ల యజమానులకు 30 ఏళ్ల వరకు ఏటా ఆదాయం వస్తుంది. ఒక్క మునగ చెట్లకు తప్ప మిగతా అన్ని రకాల మొక్కలకు ఈ పథకం వర్తిస్తుంది. లభించే ఆదాయంలో 10 శాతం ఐఓఆర్‌ఏ సంస్థ తీసుకుంటుంది.
ఈ విధంగా.. వ్యక్తిగత స్థలాలలో మొక్కలు పెంచిన వారికి, పంచాయతీలకు సుమారు ఏటా రూ.1,000 నుంచి రూ.12,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పద్ధతి వల్ల ప్రజలు మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం పట్ల మరింత ఆసక్తి చూపిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనానికి ప్రాముఖ్యత, ప్రభుత్వ లక్ష్యాలు..
ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీగా మొక్కలు నాటడానికి నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, వాటి రక్షణ సరిగా జరగకపోవడం వల్ల చాలా మొక్కలు చనిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి, ఇప్పుడు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 16 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 8 లక్షల వరకు మొక్కలు నాటారు.
పచ్చదనం పెరిగితే కాలుష్యం తగ్గుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, వాతావరణ సమతుల్యత కూడా నెలకొంటుంది. ఈ పథకం ద్వారా మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను కూడా ప్రజలకు కట్టబెట్టడం మంచి
పరిణామం.
Social Plugin