Hot Posts

6/recent/ticker-posts

విజయవాడలో యజమానిని చంపి డబ్బు, నగలతో పనిమనిషి పరార్


మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

తల్లి బాగోగుల కోసం మూడు రోజుల క్రితం పని మనిషిని పెట్టుకున్న కుమారుడు

భర్త సాయంతో యజమానిని హత్యచేసిన పనిమనిషి

ఈ ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు?

VIJAYAWADA:విజయవాడలో దారుణం జరిగింది. ఇంటి యజమానిని దారుణంగా హత్యచేసిన పని మనిషి ఆపై ఇంట్లోని బంగారం, నగలతో పరారైంది. పోలీసుల కథనం ప్రకారం.. బొద్దులూరి వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పనిమనిషిని పెట్టుకున్నారు. అనూష అదే ఇంట్లో వారితో కలిసి ఉంటోంది. 

ఈ క్రమంలో గత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండటంతో అనుమానం వచ్చిన సరస్వతి వచ్చి చూడగా కుమారుడు అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండటంతో ఆందోళన చెందారు. మంచం మీద, రామారావుపై కారం చల్లి ఉండటాన్ని గమనించారు. పనిమనిషి అనూష కనిపించకపోవడం, బీరువా పగలగొట్టి ఉండటంతో పక్కింటి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ఉదయం ఆరు గంటల సమయంలో అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితురాలు తన భర్త సాయంతో రామారావు ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.