Hot Posts

6/recent/ticker-posts

విజయవాడకు కొత్త రూపు - తాజా నిర్ణయంతో, ఇక..!!


VIJAYAWADA:విజయవాడ నగరానికి కొత్త రూపు రానుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న మెట్రో పనుల్లో కీలక అడుగు పడింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ మెట్రోరైలు కార్పొరేషన్‌ టెండర్లు పిలిచింది. రెండు ఫేజుల్లో నిర్మాణం చేపట్టనున్నారు. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ సైతం నిర్మాణం జరగనుంది. 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ నిర్మించనున్నారు. మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేసేలా కాలపరిమితి నిర్ణయించారు.

విజయవాడ మెట్రో ఫేజ్‌-1లో 38.4 కిలో మీటర్ల మేర 2 కారిడార్లతో నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి కారిడార్లో నెహ్రూ బస్టాండ్‌ నుంచి గన్నవరం బస్టాండ్‌ వరకు, రెండవ కారిడార్‌లో బస్‌స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు మెట్రో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. కారిడార్‌-1లో 4.7 కిలో మీటర్లు మేర డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ ఉండనుంది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొదటి దశ పనులు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అధునాతనంగా, వినూత్న మోడళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టుల్లో రైలు పై భాగంలో ఎలక్ట్రిక్ లైన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో నిర్మించే ప్రాజెక్టుల్లో మాత్రం ఓవర్ హెడ్ లైన్లు లేకుండానే నిర్మిస్తున్నారు.

మెట్రో రైల్‌ ప్రాజెక్టు తొలిదశ పనులకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% నిధులు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విశాఖ నగరపాలక సంస్థ, సీఆర్డీఏ నుంచి సమకూర్చనుంచి. మిగిలిన 60% నిధులను అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణంగా తీసుకోనున్నారు. ట్రాపిక్ సమస్య పరిష్కరించేలా డెన్మార్క్ దేశంలోని మెట్రో రైల్ తరహాలో టూ కార్స్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఆసియా లో ఎక్కడా లేని విధంగా 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ను నిర్మాణం ఇక్కడ ప్రత్యేకం. ఇక, టెండర్లు జారీ కావటంతో... నిర్ణీత సమయానికే టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించాలని భావిస్తున్నారు.