Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో కాంట్రాక్టర్లకు ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు!


ANDHRAPRADESH:అవును... గత జగన్ పాలనపై వచ్చిన అనేక ఫిర్యాదులలో పెండింగ్‌ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను క్లియర్ చేయకపోవడం ఒకటనే సంగతి తెలిసిందే 

2019 ఎన్నికల్లో చరిత్రలో ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా పతనమైపోవడానికి కారణం ఏమిటి? అంటే... ప్రధానంగా లిక్కర్, కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం, పాస్ పుస్తకాలపైనా సరిహద్దురాళ్లపైనా జగన్ ఫోటోలు మరికొన్ని చెబుతారు. వీటిలో మరింత కీలకంగా పనిచేసింది కాంట్రాక్టర్ల కష్టాలని చెబుతారు.

అవును... గత జగన్ పాలనపై వచ్చిన అనేక ఫిర్యాదులలో పెండింగ్‌ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను క్లియర్ చేయకపోవడం ఒకటనే సంగతి తెలిసిందే. నాడు పార్టీలకు అతీతంగా అన్నట్లుగా చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది కాంట్రాక్టర్లు నరకం చూశారు! గ్రామస్థాయిలో చేసిన చిన్న చిన్న పనులకు బిల్లులు రాక, నిరసనలు తెలిపిన పరిస్థితి.

గతంలో టీడీపీ హయాంలో చేసిన బిల్లులు కొన్ని ఇవ్వక, 2019 తర్వాత వైసీపీ మద్దతుదారులు చేసిన కాంట్రాక్ట్ పనులు కూడా క్లియర్ కాలేని పరిస్థితి. దీంతో వారంతా లబోదిబో మన్నారు. వడ్డీలు కట్టలేకపోతున్నామని మొత్తుకున్నారు. జగన్ కు వినిపించలేదు.. కనిపించలేదు! ఫలితంగా దాదాపు ఏపీలోని చిన్న, ఓ మోస్తరు కాంట్రాక్టర్లు చాలా నష్టపోయారు. 

కట్ చేస్తే... ఏపీలో ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలే ఉండటంతో.. డబుల్ ఇంజిన్ సర్కార్స్ సమన్వయంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తాజాగా ఆ శుభవార్తకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

ఇందులో భాగంగా... 2019లో జాతీయ ఉపాధి హామీ పనుల కింద సుమారు రూ.250 నుంచి రూ.300 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లను.. పనులు చేయలేదంటూ కక్ష సాధింపు చర్యలతో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత చేశారని.. ఫలితంగా గత ఆరు సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 

అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలోని రూరల్ డెవలప్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం కో ఆర్డినేట్ చేసుకుని ఆ పనులన్నింటినీ రీ ఓపెన్ చేసినట్లు తెలిపారు. వాటికి సంబంధించి రూ.180 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని.. దీనికి మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం కలిపి కేవలం 30 రోజుల్లో కాంట్రాక్టర్లకు అందేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

వాస్తవానికి సుమారు 4.30 లక్షల బిల్లులు పెండింగులో ఉండగా.. వాటిలో ఒక 60 - 70 వేల వర్క్స్ కి కాస్త సమస్య వస్తున్నప్పటికీ మిగిలిన సుమారు 3.50 లక్షల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో... 5, 10, 15 లక్షల రూపాయలు వంటి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన సుమారు మూడున్నర లక్షల మంది ఈ ప్రయత్నంతో లబ్ది పొందనున్నారు.