Hot Posts

6/recent/ticker-posts

రాజధాని విస్తరణకు భూమి సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తే మంత్రివర్గంలో స్థానం గల్లంతేనని మంత్రులకు చంద్రబాబు పరోక్ష హెచ్చరిక.


 అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఏపీ ప్ర‌భుత్వం మ‌రో 40 వేల ఎక‌రాల భూమిని సేక‌రించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఈ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులను ఒప్పించి, వారి సహకారంతోనే మ‌రో 40 వేల ఏక‌రాల భూమిని సేక‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. రైతుల‌ను ఒప్పించే ఈ అంశంలో మంత్రుల పనితీరును నిశితంగా ప‌రిశీలిస్తానని క్యాబినేట్ మంత్రుల‌కు బాబు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ అంశంలో మంత్రుల ప‌నితీరు ఆధారంగానే వారి పదవులు కూడా ఆధారపడి ఉంటాయని చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో, అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడంలో భూసేకరణ అత్యంత కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అత్యాధునిక పరిశ్రమలు, ప్రపంచ స్థాయి క్రీడా నగరాలు వంటి భారీ ప్రాజెక్టులకు ఈ అదనపు భూమి అత్యవసరమని ప్రభుత్వం గుర్తించింది.

గతంలో రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చి సహకరించిన్న‌ట్టు ఇప్పుడు కూడా ఎటువంటి వివాదాలు లేకుండా భూములు సేక‌రించ‌డంలో మంత్రులు కీల‌క పాత్ర పోషించాల‌ని బాబు సూచించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ భారీ భూసేకరణ ప్రక్రియ మంత్రులకు ఒక సవాలుగా మారనుంది. రైతులను ఒప్పించి, వారి ఆమోదంతో భూమిని సేకరించడం అంత సులభం కాదు. దీనికి మంత్రులు స్థానికంగా చొరవ తీసుకుని, ప్రభుత్వ అండ పూర్తిగా ఉంటుందని, రైతులకు తగిన పరిహారం, పునరావాసం కల్పిస్తుందని భరోసా ఇవ్వాలి. ఈ అంశంలో మంత్రుల పనితీరును బట్టే వారికి మంత్రిమండలిలో స్థానం పదిలంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేయడం క్యాబినేట్ మంత్రుల గుండెల్లో ప్రస్తుతం ద‌డ పుట్టిస్తోంది.

మెరుగు ప‌డ‌ని మంత్రుల ప‌నితీరు..

ప్రభుత్వం ఏర్పడి ఏడ‌దైన‌ కీలకమైన ఫైళ్లు పేరుకుపోవడం, ప్రజా సమస్యలపై మంత్రుల దృష్టి సారించకపోవడం వంటి అంశాలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని శాఖల పనితీరును స్వయంగా సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రుల ప‌నితీరు ప‌ట్ల తీవ్ర అస‌హనం వ్యక్తం చేసిన‌ట్లు సమాచారం. ముఖ్యంగా సచివాలయానికి చాలా మంది మంత్రులు క‌నీసం వారంలో మూడు రోజుల కూడా రావ‌డం లేదని, నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడంలోనూ వెనుకబడి ఉన్నారని ఆయన గుర్తించినట్లు తెలుస్తోంది.

లోకేష్, పవన్ సహా అందరికీ ఒకే మాట..

క్యాబినేట్‌లో కీల‌క మంత్రులుగా, ముఖ్య‌ శాఖలను నిర్వహిస్తున్న నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ఇదే దారిలో పయనిస్తున్నారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడం, వారి సమస్యలను పరిష్కరించడంలో ఈ యువ మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చడం లేదని ఆయన గుర్తించినట్లు తెలుస్తోంది. మంత్రులందరూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని, పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

పేరుకుపోతున్న ఫైల్స్- నియోజకవర్గాల్లో వ్యతిరేకత..

సచివాలయంలో కుప్పలు తెప్పలుగా ఫైళ్లు పేరుకుపోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాలనలో జాప్యం జరగకుండా మంత్రులు చురుకుగా పనిచేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు, పలువురు మంత్రులపై వారి నియోజకవర్గాల్లోనే వ్యతిరేకత పెరుగుతోందని సర్వేల ద్వారా చంద్రబాబుకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులుగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించినట్లు సమాచారం.

త్వరలోనే కేబినెట్ మార్పులు?

మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్న చంద్రబాబు నాయుడు, త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వేలు చేయిస్తున్న చంద్రబాబు, ఆ సర్వేల నివేదికల ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పనితీరు కనబరచని వారికి పదవులు దక్కవని, సమర్థవంతంగా పనిచేసే వారికి మాత్రమే మంత్రిమండలిలో స్థానం ఉంటుందని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.