జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ
కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి: డీలర్లకు మంత్రి నాదెండ్ల సూచన
ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టాలని రేషన్ డీలర్లకు పిలుపు
దివ్యాంగులు, వృద్ధులకు వారి ఇంటివద్దే రేషన్ అందజేత
విజయవాడలో ట్రయల్ రన్, సేవా శిబిరాన్ని పరిశీలించిన మంత్రి మనోహర్
ANDRAPRADESH, AMARAVATHI: రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని, రేషన్ డీలర్లు ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టి, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరుకులు పంపిణీ చేయాలని ఆయన కోరారు. జూన్ 1న పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న సన్నాహాలను పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం విజయవాడలో పర్యటించారు. మధురానగర్‌లోని 218వ నంబర్ రేషన్ దుకాణంలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన చౌకధరల దుకాణాల ఈ-పాస్, వెయింగ్ మెషీన్ల సేవా శిబిరాన్ని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్‌తో కలిసి మంత్రి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ రేషన్ డీలర్లతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని మళ్లీ చేపడుతున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. "గతంలో రేషన్ డీలర్లు కార్డుదారుల కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండి సేవలు అందించారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో, మనసుపెట్టి పనిచేసి కార్డుదారులకు గౌరవంగా సేవలు అందించాలి," అని మంత్రి సూచించారు.
ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఆదివారాల్లో కూడా రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఐదో తేదీలోపే దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటివద్దకే సరుకులు చేరేలా డీలర్లు చొరవ చూపాలని కోరారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం ద్వారా కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చన్నారు. ఒకవేళ సాంకేతిక సమస్యలు తలెత్తినా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకుల పంపిణీ ఆగకుండా చూడాల్సిన బాధ్యత డీలర్లపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రేషన్ డీలర్లు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రేషన్ దుకాణాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, సరైన తూకంతో సరుకులు పంపిణీ చేయాలని, ధరలు, స్టాక్ వివరాల బోర్డులను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ఈ-పాస్, వెయింగ్ మెషీన్ల మరమ్మతుల కోసం ఏర్పాటు చేస్తున్న సర్వీస్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని, సరుకుల పంపిణీకి సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, డీఎస్‌వో ఎ.పాపారావు, ఏఎస్‌వోలు, పౌరసరఫరాల శాఖ డీటీలు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
Social Plugin