Hot Posts

6/recent/ticker-posts

విజయవాడ-గుంటూరు మధ్యలో వైసీపీ రాజధాని!


ANDRAPRADESH, VIJAYAWADA, GUNTURU: రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలోచనలు రకరకాల చర్చకు దారితీస్తున్నాయి. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని నిర్మిస్తారని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో గతంలో లేవనెత్తిన మూడు రాజధానుల అంశం వెనక్కి వెళ్లినట్లేనని అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు మూడు రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించడంతో జగన్ ఆలోచన మార్చుకున్నారని, విజయవాడ-గుంటూరు మధ్యలో 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి ఆయన సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. 


మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అట్టహాసంగా నిర్మిస్తున్న అమరావతిపై తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎప్పటిలానే రాజధాని కోసం వేల కోట్లు అప్పు చేయడాన్ని తప్పుబట్టారు. గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానులకు బదులుగా కొత్తగా విజయవాడ-గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ భూముల్లో రాజధాని నిర్మించొచ్చు కదా? అంటూ ప్రతిపాదించారు. అక్కడ 500 ఎకరాల భూములు ఉన్నాయని, వాటిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మిస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత గుంటూరు, విజయవాడ నగరాలు వాటింతట అవే అభివృద్ధి చెందుతాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అయితే జగన్ ప్రతిపాదనలను కూటమి పార్టీల నేతలు విమర్శిస్తుండగా, వైసీపీ అనుకూల శ్రేణులు మాత్రం సమర్థిస్తున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనపై వెనక్కి తగ్గిన జగన్.. అమరావతిని ఏకైక రాజధానిగా పరోక్షంగా అంగీకరించారని అంటున్నారు. అయితే ప్రభుత్వం రైతుల భూముల్లో భారీ భవనాలను కట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. నాగార్జున యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకుని రాజధాని నిర్మిస్తే డబ్బు ఆదా అవుతుందని తన ఆలోచన బయటపెట్టారని అంటున్నారు. అయితే జగన్ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు లేవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఇప్పటికే కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనులను పట్టాలెక్కించదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి గుండెకాయ వంటి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాల కోసం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభ పనులను మొదలపెట్టారు. ఇలాంటి సమయంలో జగన్ ప్రతిపాదన వృథా ప్రయాసగా కొట్టిపడేస్తున్నారు. అయితే వైసీపీ అధినేతలో వచ్చిన రాజకీయ మార్పుగా దీనిని అభివర్ణిస్తున్నారు. తొలి నుంచి అమరావతిలో రాజధానిని వ్యతిరేకిస్తున్న వైసీపీ.. ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోని నాగార్జున వర్సిటీలో రాజధాని నిర్మించాలని ప్రతిపాదించడం ద్వారా పరోక్షంగా అమరావతిని సమర్ధించేనట్లేనా? అనే చర్చ జరుగుతోంది. 

మరోవైపు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఆయన ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఇదే టైంలో మరో మూడేళ్లలో రాజధానిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో జగన్ ఆలోచనలు ఊాహాలకే పరిమితమంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధానిగా అమరావతిని నోటిఫై చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు హోంమంత్రి అమితాషా ను కలిసి దీనిపై చర్చించారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలని చూస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఎత్తుగడలను అడ్డుకోడానికి వైసీపీ ప్రయత్నిస్తుందా? బీజేపీ పెద్దలతో పరిచయాలను ఉపయోగించుకుని బిల్లు పార్లమెంటుకు రాకుండా చూడగలదా? అనేది ఆసక్తి రేపుతోంది.